గృహస్థులపై వాస్తు శాస్త్రం ఎలా పనిచేస్తుంది – SubhaVaastu
వాస్తు శాస్త్రం మానవులపై ఎలా తన ప్రభావమును చూపిస్తుందో తెలుసుకుందాం. ఒకే గృహం లో కొందరికి అద్భుతంగా జరుగుతుంది, మరొకరికి ఏమాత్రం బాగా జరగదు. ఇలా ఎందుకవుతున్నది అనే విషయం తెలుసుకుందాం. ఏ శాస్త్రమైననూ పరిశోధన చేయకపోతే కొత్త విషయాలు ఆవిష్కరణకు నోచుకోవు. ఉదాహరణకు, ఒకప్పుడు మనం వాడే వాహనాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి!, ఒకప్పుడు మన వారికి ఏదైనా విషయం తెలపాలనుకుంటే ఉత్తరాలు వ్రాసేవారము. ఇప్పుడు, క్షణాలలో విదేశాలలో వున్నవారికి కూడా వెంటనే విషయాన్ని తెలియచేస్తున్నాము. ఇదంతా పరిశోధన ఫలితాలే కదా. ప్రతి విషయంలో కూడా పరిశోధన జరగాలి, అలాగే వాస్తు శాస్త్రాన్ని కూడా పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, అప్పుడే మాత్రమే కొత్త కొత్త విషయాలు లోతైన రహస్యాలు తెలుస్తాయి. కొత్త కోణాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి.1. విద్యావంతులకు ఎదుటివారు ఏం చెబుతున్నారో బాగా అర్థమవుతుంది, విద్య లేనివారు ఎదుటివారు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మధ్యస్థం వాళ్లు ఎదుటివారు ఏమి చెప్పినా కూడా విమర్శ మాత్రమే చేస్తారు. విశ్లేషణ చేసే వ్యక్తి భవిష్యత్తులో బాగా ఎదుగుతాడు. విమర్శించే వ్యక్తి భవిష్యత్తులో దిగజారిపోతాడు. ఎటు ప్రక్క మొగ్గుతారో మీరే నిర్ణయించుకోండి.
2. వాస్తు శాస్త్రం కొందరికి మాత్రమే పనిచేస్తుందా అందరికీ పని చేయదా. ఏ విషయంలోనైనా పరిశోధనలు చేయకపోతే అభివృద్ధి ఉండదు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువు వెనుక పరిశోధన ఉంది. ఉదాహరణకు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకోండి. పూర్వకాలంలో పావురాల ద్వారా సమాచారాన్ని పంపేవారు. పరిశోధన లేకపోతే నేటికీ అదే పరిస్థితి ఉండేది.
3. తరువాత కాలంలో వార్తాహారులు ప్రవేశించారు. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వార్తలు చేరవేయడం వీరి పని. ఈ పద్ధతి రాజులు, సామంతులు మరియు అత్యంత ధనికులకే పరిమితమైంది. ఇది శ్రమతో కూడిన, ఖరీదైన విధానం. అంతేకాకుండా ఇందులో ఖచ్చితత్వం తక్కువగా ఉండేది, అనగా సమాచారం తప్పకుండా చేరుతుందనే హామీ ఉండేది కాదు. మధ్య దారిలో ఏదైనా జరగవచ్చు.
4. అనేక దేశాలలో ఈ విధానాలు కొనసాగాయి. తరువాత ఉత్తరాల బట్వాడా ప్రారంభమై సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అనంతరం టెలిఫోన్ కనుగొనబడింది.
5. 1965–1995 మధ్యకాలంలో దూరప్రాంతాలకు ఫోన్ చేయాలంటే టెలిఫోన్ ఆఫీస్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సివచ్చేది. ప్రస్తుతం క్షణాల్లో ప్రపంచంలోని ఎక్కడున్న వారితోనైనా మాట్లాడగలుగుతున్నాం. దయచేసి గమనించండి, ఇదంతా పరిశోధన ఫలితం
6. చేతి గడియారాలు కూడా పరిశోధనల వల్ల అభివృద్ధి చెంది నేటి ఆధునిక రూపాన్ని పొందాయి. లేకపోతే ప్రతిరోజూ గడియారానికి "కీ" ఇవ్వాల్సి వచ్చేది.
7. పూర్వకాలంలో ఎద్దుల బండ్లపై ప్రయాణాలు నరకయాతనలాగా ఉండేవి. పరిశోధనల ఫలితంగా నేడు ఏసీ కార్లలో సాఫీ రహదారులపై ప్రయాణిస్తున్నాం. పరిశోధన లేకపోతే ఈ మార్పు సాధ్యమా?
8. వంట కోసం బొగ్గులు ఊది అగ్ని రాజేసే రోజులు గడిచిపోయాయి. నేడు గ్యాస్ స్టవ్ ద్వారా క్షణాల్లో వంట పూర్తవుతోంది. ఇవన్నీ పరిశోధనల వల్లే.
9. ఒకప్పుడు నీటి కోసం చేదబావుల వద్దకు వెళ్లి బిందెలు మోసేవారు. ఇప్పుడు స్విచ్ వేయగానే నీరు వస్తోంది. పరిశోధనలు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేదా?
10. ప్రతి శాస్త్రం అభివృద్ధికి పరిశోధన అవసరం. వాస్తు శాస్త్రం కూడా అనేక పరిశోధనల ద్వారా సంపూర్ణత సాధించే దశలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ శాస్త్రానికి తగిన ప్రోత్సాహం లభించడం లేదు.
11. ప్రోత్సాహం బదులు విమర్శలు ఎదురైతే ఏ శాస్త్రమైనా అభివృద్ధి చెందదు. పరిశోధకులు ముందడుగు వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
12. విదేశాలలో పరిశోధకులకు గౌరవం, సహకారం లభిస్తుంది. అందుకే ఎక్కువ పరిశోధనలు అక్కడే జరుగుతుంటాయి. ఈ విషయం మీకు బాగా తెలుసు. మన దేశంలో మాత్రం అసూయ, ఈర్ష్య కారణంగా పరిశోధనలను, ప్రతిభను, అణచివేస్తున్నారు. మనం ఎదగకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు ఎదగకూడదు అనేది మన దేశంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. మన పక్క వారు ఏ పరిశోధనలు చేసిన అవహేళన చేయడం అవమానానికి గురి చేయడం నిరుత్సాహపరచడం గొడవలకు దిగడం ఇతరులకు పితురీలు చేసి తరువాత పరిశోధనలు జరగకుండా ఆపడం ఇటువంటివన్నీ ఒక నీచ మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు.
13. దయచేసి అసూయను జయించండి. భారతదేశానికి అపారమైన వనరులు, మేధస్సు ఉన్నాయి. మానసికంగా అయినా పరిశోధకులకు సహాయం చేస్తే దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మన మహర్షులు మన సమాజంపై ప్రేమతో అందించిన ఈ వాస్తు శాస్త్రాన్ని మరింతగా అధ్యయనం చేసి, లోతైన పరిశీలనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్నో కొత్త విషయాలను కనుగొనే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలియజేస్తూ, తగిన రీతిలో సహకరిస్తే ఈ శాస్త్రాన్ని అన్ని కోణాలలో లోతుగా పరిశీలించి, అనేక కొత్త ఆవిష్కరణలను వెలికి తీయవచ్చు. అలా సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే విధంగా అందరం చేతులు కలిపి ముందుకు సాగితే, ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలుపగలుగుతాము.
14. ఇక వాస్తు శాస్త్ర పరిశోధనల విషయానికి వస్తే ఒక ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తు శాస్త్రం కొందరికే పనిచేస్తుందా? లేక అందరికీ సమానంగా ఫలితాలు ఇస్తుందా? అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది.
15. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా సమాజాన్ని మూడు వర్గాలుగా విభజించుకోవాలి. అవి :
1. అదృష్ట జాతకులు.
2. మధ్యమ జాతకులు.
3. అధమ జాతకులు.
1. అదృష్ట జాతకులు. ఈ అదృష్ట జాతకుల వర్గాన్ని మళ్లీ రెండు ఉపవర్గాలుగా విభజించవచ్చు. మహా అదృష్ట జాతకులు (సహజ భాగ్య జాతకులు) మరియు అదృష్ట జాతకులు (సాధన భాగ్య జాతకులు) వీరిలో కొందరు సహజంగానే అనుకూల పరిస్థితులతో జన్మిస్తారు (మహా అదృష్ట జాతకులు / సహజ భాగ్య జాతకులు), మరికొందరు తమ కృషి మరియు సరైన మార్గదర్శకత్వం వల్ల అదృష్టాన్ని సంపాదించుకుంటారు.
మహా అదృష్ట జాతకులు | సహజ భాగ్య జాతకులు
ఈ వర్గానికి చెందిన వ్యక్తులకు వాస్తు అనుకూలంగా ఉన్నా లేకపోయినా జీవితంలో ముందుకు సాగేందుకు అవకాశాలు స్వయంగా లభిస్తూ ఉంటాయి. ఎల్లలు దాటి, దేశాలు దాటి వీరి అభివృద్ధి కొనసాగుతుంది. వారు ఎటువంటి గృహంలో నివసించినా అభివృద్ధిని సాధిస్తూనే ఉంటారు. సాధారణంగా వీరికి అపజయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏమి ముట్టుకున్నా బంగారం అవుతుంది అన్నట్లు, వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపార కారణాలవల్ల గానీ లేదా ఇతర అవసరాల మేరకు గానీ వీరు గృహం మారాల్సిన పరిస్థితి వచ్చినా, లేదా మరో గృహంలో రెండు మూడు సంవత్సరాలు నివసించాల్సి వచ్చినా, ఒకవేళ ఆ గృహం పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇటువంటి వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం నివసించలేరు. ఆ గృహంలోకి ప్రవేశించిన కొద్ది రోజులలోనే, అనగా మూడు నాలుగు రోజుల్లోనే లేదా ఒక నెలలోపుగా , ఏదో ఒక కారణం చేత అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వీరి అదృష్టమే వీరిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది.
అందువల్ల ఇటువంటి వ్యక్తుల విషయంలో వాస్తు ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే కనిపిస్తుంది.